ఇంకా పెరగనున్న పెట్రోల్ ధరలు : భారత్ విజ్ఞప్తిని పట్టించుకోని ఒపెక్

News

views 18

Mar 5th,2021

చమురు ఉత్పత్తిపై పరిమితులను సడలించాలని భారత దేశం చేసిన విజ్ఞప్తికి సౌదీ అరేబియా మన దేశానికి గత ఏడాది చౌక ధరలకు కొనుగోలు చేసిన చమురును ఉపయోగించుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చింది.  మన దేశంలో ఇప్పటికే వినియోగదారులకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఈ పెరుగుదల ప్రభావం ఉండవచ్చు. అయితే శాసన సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ధరలను పెంచే సాహసానికి తెగించకపోవచ్చుననే వాదన కూడా ఉంది.

ఒపెక్, దాని మిత్ర దేశాలను కలిపి ఒపెక్ ప్లస్‌ అని పిలుస్తారు. వీటి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముందే భారత దేశ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పెట్రోలియం ఉత్పత్తిపై విధించుకున్న ఆంక్షలను సడలించాలని, చమురు ధరల స్థిరీకరణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై దెబ్బపడుతోందని తెలిపారు.సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత దేశం గత ఏడాది చౌకగా కొన్న క్రూడ్‌ను తీసి, వాడుకోవాలనిఒపెక్ ప్లస్ సమావేశం అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.

 

ధర్మేంద్ర ప్రధాన్ 2020 సెప్టెంబరు 21న రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ చమురు సగటు ధర ఒక బ్యారెల్‌కు 19 డాలర్లని చమురు ధరలు తగ్గినపుడు గత ఏడాది మన దేశం వ్యూహాత్మకంగా కొంత చమురును కొని, నిల్వ చేసిందని 2020 ఏప్రిల్-మే నెలల్లో 16.71 మిలియన్ బ్యారెళ్ళ క్రూడ్‌ను కొని, ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాడూర్‌లలో నిల్వ చేసినట్టు తెలిపారు.అంతర్జాతీయంగా ధరలు పెరిగినందువల్ల ఆ మేరకు భారాన్ని వినియోగదారులపై మోపాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకుంటే ఇప్పటికే భారీగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...