Pegasus Spyware : Congress Demands
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనుంది. దేశంలో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. వంటి కీలక నేతల ఫోన్ నంబర్లు పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్‌కు గురైనట్లు తేలడంతో కాంగ్రెస్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది. 2019 నాటి సాధారణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు వినియోగించే ఫోన్లను హ్యాక్ చేయడానికి బీజేపీ పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించిందనే ఆరోపణలు దేశంలో కలకలం రేపుతోన్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో దీన్ని ప్రస్తావించదలచుకుంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఏక కాలంలో రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది పార్టీ అధిష్ఠానం. దీనితోపాటు- పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై ప్రతిరోజూ విలేకరుల సమావేశాలను నిర్వహించాలని సూచించింది. ఈ స్కాండల్ వల్ల కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
పార్లమెంట్ ఉభయసభల తొలిరోజే ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ అంశంపై లోక్‌సభలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోతే.. సభను స్తంభింపజేయాలని కాంగ్రెస్, దాని మిత్రపక్ష సభ్యులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది.
2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అప్పటి ఎన్డీఏ కూటమికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన బీజేపీకి దూరం కావడంతో నిఘా పెరిగినట్టు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావా, ఎలక్షన్స్ వాచ్‌డాగ్ ఏడీఆర్ వ్యవస్థాపకుడి ఫోన్ నంబర్లు హ్యాక్ కావడం.. ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించినట్లు వెల్లువెత్తుతోన్న విమర్శలు, తలెత్తుతోన్న అనుమానాలకు బలం కలిగించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీని భారతీయ జాసూసీ పార్టీగా ప్రత్యర్థులు విమర్శిస్తోన్నారు.
Comments
Post Your Comment
Public Comments: